ఆంధ్రప్రదేశ్
జిల్లా పరిషత్ కార్యాలయం ప్రారంభం
26-09-2026 09:44
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు
xPress24, Anakapalli, September 25,
అనకాపల్లి, సెప్టెంబర్ 25:
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ అదనపు బాధ్యతలను స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధికి, ప్రజలకు ఇది శుభదినమని అన్నారు. గతంలో ఉమ్మడి జిల్లా పరిధిలో సమావేశాలు నిర్వహించాల్సి రావడంతో అనకాపల్లి జిల్లా సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు తగిన సమయం లభించేది కాదని తెలిపారు. ప్రస్తుతం ప్రత్యేక జిల్లా పరిషత్ ఏర్పాటుతో జిల్లాకు సంబంధించిన సమస్యలను వివరంగా చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కలిగిందన్నారు.
జిల్లాకు కేటాయించే నిధులను పూర్తిగా అనకాపల్లి జిల్లా అభివృద్ధి పనులకే వినియోగించేందుకు అవకాశం ఏర్పడిందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్‌కు సంబంధించిన ప్రతి అధికారి సమన్వయంతో పనిచేస్తూ జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించేందుకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, గతంలో స్థానిక ప్రజా ప్రతినిధులు జిల్లా పరిషత్ పనుల కోసం విశాఖపట్నం వెళ్లాల్సి వచ్చేదని, దీంతో పాయకరావుపేట, మాడుగుల, నర్సీపట్నం తదితర ప్రాంతాలకు చెందిన సర్పంచ్‌లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఇబ్బందులు ఎదుర్కొనేవారని తెలిపారు. ప్రస్తుతం అనకాపల్లిలోనే జిల్లా పరిషత్ కార్యాలయం అందుబాటులోకి రావడం ప్రజా ప్రతినిధులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు.
గతంలో గెస్ట్‌హౌస్‌గా నిర్మించిన భవనం అనంతరం ఆర్డీవో కార్యాలయంగా వినియోగంలోకి వచ్చిందని, ప్రస్తుతం అప్‌గ్రేడ్ చేసి జిల్లా పరిషత్ కార్యాలయంగా రూపాంతరం చెందిందని కొణతాల రామకృష్ణ వివరించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్ పరిధిలో ఉన్న ఆస్తుల్లో 24 జెడ్పీటీసీలు ఉన్న అనకాపల్లి జిల్లాకు తగిన వాటా కేటాయించాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని ఉన్నతాధికారులు కోరినట్లు తెలిపారు.
జిల్లా పరిషత్ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, పాత భవనాలను తొలగించి నాలుగు అంతస్తుల నూతన భవనాన్ని నిర్మించాలని సూచించారు. నూతన భవనంలో జనరల్ బాడీ సమావేశ మందిరం, గెస్ట్‌హౌస్‌లు, ఇతర కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
శారదా నది ఒడ్డున జిల్లా పరిషత్‌కు ఉన్న ఎకరం స్థలంలో పార్కు, గెస్ట్‌హౌస్ నిర్మించేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో అనకాపల్లి జిల్లా రాష్ట్ర అభివృద్ధికి ఇంజిన్‌గా మారుతోందని, అత్యధిక ఆదాయం, తలసరి ఆదాయం కలిగిన ప్రధాన గ్రోత్ ఇంజిన్‌గా జిల్లా రూపుదిద్దుకుంటోందని తెలిపారు.
గ్రామీణాభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 15వ, 16వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలు, స్థానిక సంస్థలకు అందిస్తూ గ్రామాల పునరుద్ధరణకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. రహదారుల నిర్మాణంలో భాగంగా పల్లె పథకం ద్వారా తొలి విడతలో సుమారు 4,000 కిలోమీటర్లు, రెండో విడతలో 6,000 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. త్వరలో మూడో విడత పనులు కూడా ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.
అనకాపల్లి జిల్లాను అగ్రగామి జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని, రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా అనకాపల్లిని అభివృద్ధి చేసేందుకు సహకరించాలని శాసనసభ్యులు కోరారు.