ఆంధ్రప్రదేశ్
జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభం
25-09-2026 17:57
విజయనగరం జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శుక్రవారం స్థానిక కంటోన్మెంట్ మున్సిపల్ హైస్కూల్‌లో ప్రారంభించారు.
xPress24, Vizianagaram, September 25,
విజయనగరం జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శుక్రవారం స్థానిక కంటోన్మెంట్ మున్సిపల్ హైస్కూల్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆల్బెండజోల్ మాత్రలను మింగించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలందరికీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచితంగా 400 మి.గ్రా. ఆల్బెండజోల్ మాత్రలను అందజేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అనంతరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
నులిపురుగుల కారణంగా రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి మందగించడం, నీరసం, ఆందోళన, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. నులిపురుగుల నివారణకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ మాత్రను తీసుకోవాలని సూచించారు.