ఆంధ్రప్రదేశ్
డోలీ రహదారి పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి
07-10-2026 17:47
మారుమూల గిరిజన ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు చేపట్టిన డోలీ రహదారి నిర్మాణ పనులను రాబోయే డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
xPress24, Paravathipuram, October 7,
పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 7:
జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు చేపట్టిన డోలీ రహదారి నిర్మాణ పనులను రాబోయే డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
బుధవారం పార్వతీపురంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్, ఐటీడీఏ శాఖలకు చెందిన ఈఈలు, డీఈఈలు, ఏఈఈలతో జిల్లాలో కొనసాగుతున్న రహదారి నిర్మాణ పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
డోలీ రహదారి నిర్మాణ పనుల్లో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి రహదారి పనిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. డోలీ రహదారి పనులు పూర్తయిన అనంతరమే ఇతర సాధారణ రహదారి పనులకు ఆమోదం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
పనితీరు సరిగా లేకుండా పనులను ఆలస్యం చేస్తున్న కాంట్రాక్టర్ల స్థానంలో కొత్త కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్ల పనితీరు, పని సామర్థ్యం, అవసరమైన యంత్రాలు, ఇతర వసతులను పరిశీలించిన అనంతరమే పనుల బాధ్యతలు అప్పగించాలని స్పష్టం చేశారు.
ఉపాధి హామీ పథకం, ఇతర నిధుల కింద మంజూరైన సీసీ రహదారుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనల ప్రకారం అనుమతించబడిన మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణానికే అనుమతి ఇవ్వాలని తెలిపారు.
ప్రతి ఇంజనీరింగ్ అధికారి క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ రహదారి నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షించాలని, పనుల నాణ్యతను స్వయంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.