ఆంధ్రప్రదేశ్
తీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలి
03-10-2026 17:03
విజయనగరం జిల్లాలో తీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు మత్స్యకారులు, పర్యాటకులు, తీర ప్రాంత ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
xPress24, Vizianagaram, October 3,
విజయనగరం, అక్టోబర్ 3:
విజయనగరం జిల్లాలో తీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు మత్స్యకారులు, పర్యాటకులు, తీర ప్రాంత ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
శనివారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కోస్టల్ సెక్యూరిటీ జిల్లా స్థాయి కమిటీ సమావేశం వర్చువల్ విధానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తీర ప్రాంత భద్రత, మత్స్యకారుల రక్షణ, నిఘా వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు, విపత్తుల సమయంలో రాకపోకలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలపై సమగ్రంగా సమీక్షించారు.
సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. తీర ప్రాంతంలో అనుమానాస్పద కార్యకలాపాలు, అక్రమ రవాణా, చొరబాట్లు, దొంగతనాలను నిరోధించేందుకు 16 ల్యాండింగ్ పాయింట్ల వద్ద నైట్ విజన్ సామర్థ్యం కలిగిన హెచ్‌డీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సముద్ర ప్రాంతంలో నిరంతర నిఘా కొనసాగించేందుకు చింతపల్లి, చేపలకంచెరు తీర ప్రాంతాల్లో వాచ్‌టవర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించాలని సూచించారు. అలాగే చింతపల్లి తీర ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించేందుకు ఆల్ టెర్రైన్ వెహికల్స్ (ఏటీవీలు) అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరంపై సమావేశంలో చర్చించారు.