తెలంగాణ
తెలంగాణలో 15 నుంచి 18 వరకు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
13-10-2026 10:59
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో అక్టోబర్ 15 నుంచి 18 వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉండటంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
xPress24, Hyderabad, October 13,
తెలంగాణలో అక్టోబర్ 15 నుంచి 18వ తేదీ వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దేశంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి.
గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు.. ఎల్లో హెచ్చరికలు
అక్టోబర్ 15 ఉదయం నుంచి 17వ తేదీ వరకు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురవవచ్చని హెచ్చరించింది. అక్టోబర్ 17 నుంచి 19 వరకు కూడా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే సూచనలున్నాయని వెల్లడించింది. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లోనూ రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.