తెలంగాణ
తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్
05-10-2026 14:25

రాష్ట్రంలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు ఎనిమిదో విడత ఖేలో ఇండియా యూత్ గేమ్స్- 2026ను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది.
xPress24, Hyderabad, October 5,
రాష్ట్రంలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు ఎనిమిదో విడత ఖేలో ఇండియా యూత్ గేమ్స్- 2026ను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. తెలంగాణను ప్రపంచస్థాయి క్రీడా కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ క్రీడా వేడుకలకు ఆతిథ్యం దక్కింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌కు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 11న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభం కానున్న ఈ క్రీడా సంబరం, డిసెంబర్ 22న ఎల్‌బీ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో ముగియనుంది.
హైదరాబాద్‌తో పాటు వరంగల్, హనుమకొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈ పోటీలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 7,500 మందికి పైగా యువ క్రీడాకారులు, 1,500 మంది సహాయక సిబ్బంది, 1,000 మందికి పైగా సాంకేతిక నిపుణులు ఈ టోర్నీలో పాల్గొననున్నారు. రాష్ట్ర క్రీడా వ్యవస్థను ఒలింపిక్ పతకాలు సాధించే స్థాయికి తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం గతేడాది తెచ్చిన ‘తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ-2025’ స్ఫూర్తితో ఈ వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 27 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. హనుమకొండలో అథ్లెటిక్స్, కరీంనగర్‌లో జూడో, ఖమ్మంలో ఆర్చరీ, మహబూబ్‌నగర్‌లో కబడ్డీ, నిజామాబాద్‌లో టేబుల్ టెన్నిస్ పోటీలు జరగనుండగా, మిగిలిన క్రీడాంశాలు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఎల్‌బీ స్టేడియం, సరూర్‌నగర్, జేఎన్‌టీయూహెచ్, సికింద్రాబాద్, యూసు్‌ఫగూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియాల్లో నిర్వహించనున్నారు.
తెలంగాణ ఆతిథ్య క్రీడగా రోయింగ్, ప్రదర్శన క్రీడగా సెయిలింగ్ నిలవనున్నాయి. ముఖ్యంగా హుస్సేన్‌సాగర్ వాటర్ స్పోర్ట్స్ కేంద్రంలో నిర్వహించనున్న రోయింగ్, కయాకింగ్, కానోయింగ్ పోటీలు ఈ టోర్నమెంట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, హాకీ, జూడో, ఖో-ఖో, కబడ్డీ, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్‌తోపాటు గట్కా, మల్లఖంబ్, కలరిపయట్టు, థాంగ్-టా, యోగాసన వంటి క్రీడలు ఇందులో చోటు దక్కించుకున్నాయి.
క్రీడల విజయవంతం కోసం ప్రభుత్వం ఐదు రాష్ట్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. ఆర్గనైజింగ్ కమిటీకి సీఎం రేవంత్‌రెడ్డి చైర్మన్‌గా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కో-చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. క్రీడాకారులు, అతిథుల వసతి, భోజనం, రవాణా ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ప్రత్యేక ఉన్నత స్థాయి కమిటీ పనిచేయనుంది. హైదరాబాద్‌తో పాటు ఇతర వేదికల్లోని క్రీడాకారుల గదులు, ప్రేక్షకుల సౌకర్యాలు, మరుగుదొడ్లు, స్విమ్మింగ్ పూల్స్, సైక్లింగ్ ట్రాక్‌లు, షూటింగ్ రేంజ్‌లను ఆధునికీకరిస్తూ మెరుగైన వసతులు కల్పించనున్నారు