తెలంగాణ
తెలంగాణలో రాగల మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు
05-10-2026 09:36
తెలంగాణలో అక్టోబర్ 4 నుంచి 7వ తేదీ ఉదయం వరకు ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ వేగంతో కూడిన ఈదురు గాలులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి సహా పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేయగా, అక్టోబర్ 7 నుంచి పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపింది.
xPress24, Hyderabad, October 5,
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఈనెల 7వ తేదీ ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పొడిగా మారే సూచనలు ఉన్నాయని స్పష్టం చేసింది.
పలు జిల్లాలకు వర్ష హెచ్చరికలు.. అధికారుల అప్రమత్తత
ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, మహబూబ్‌నగర్ సహా పలు దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు విస్తరించే అవకాశముంది. ఎల్లుండి వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని తెలిపింది. ఈదురు గాలులు, ఉరుముల సమయంలో ప్రజలు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు సూచించారు.