జాతీయం
దిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ‘ఇండి’ కూటమి నిరసన
06-10-2026 17:12
కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ప్రతిపక్ష ‘ఇండి’ కూటమి ఎంపీలు దిల్లీలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘నిర్వాచన్ సదన్’ వైపు సాగిన ఈ ఆందోళన సందర్భంగా రాజధానిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
xPress24, Delhi, October 6,
కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ‘ఇండి’ కూటమి ఎంపీలు దిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ మకర ద్వారం నుంచి అశోకా రోడ్డులోని ఈసీ ప్రధాన కార్యాలయమైన ‘నిర్వాచన్ సదన్’ వైపు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసనలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే ఎంపీలు ఈ నిరసన ర్యాలీకి దూరంగా ఉన్నారు.
పోలీసుల మోహరింపు, ఉద్రిక్తత
విపక్షాల ఆందోళన నేపథ్యంలో రాజధానిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం జంతర్ మంతర్ మరియు పరిసర ప్రాంతాలలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసీ ప్రధాన కార్యాలయం చుట్టూ భారీ బారికేడ్లను ఏర్పాటు చేసి, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, దిల్లీ పోలీసులను మోహరించారు. విపక్ష ఎంపీల నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రోడ్డుపైనే బైఠాయించి ధర్నాకు దిగారు.
పారదర్శకత కొరవడిందంటూ ఇండి కూటమి ఆరోపణలు
ఓటర్ల జాబితా సవరణ, ఓట్ల తొలగింపు వ్యవహారంలో పారదర్శకత కొరవడిందని, ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఇండియా కూటమి నేతలు ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు కేంద్రంలోని బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా నేతలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, సీఈసీ రాజీనామా చేసేవరకు తమ పోరాటం సుదీర్ఘంగా సాగుతుందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.