జాతీయం
దేశంలో 111.41 కోట్లకు చేరిన ఇంటర్నెట్ వినియోగదారులు .. 94.31 శాతానికి పెరిగిన టెలీ-డెన్సిటీ
13-10-2026 10:59
భారత్‌లో ఇంటర్నెట్ చందాదారుల సంఖ్య 2026 జూన్ నాటికి 111 కోట్ల 41 లక్షలకు చేరిందని ట్రాయ్ నివేదిక స్పష్టం చేసింది. ఇందులో అత్యధికంగా 106 కోట్లకు పైగా వైర్‌లెస్ ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. అలాగే మొత్తం టెలిఫోన్ కనెక్షన్ల సంఖ్య 134 కోట్లకు చేరడంతో దేశ టెలీ-డెన్సిటీ 94.31 శాతానికి చేరింది.
xPress24, Delhi, October 13,
దేశంలో ఇంటర్నెట్ చందాదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2026 జూన్ చివరి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 111 కోట్ల 41 లక్షలకు చేరింది. 2026 మార్చి నాటికి ఉన్న 109 కోట్ల 28 లక్షలతో పోలిస్తే ఇది త్రైమాసిక వృద్ధిని నమోదు చేసిందని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) తన తాజా పనితీరు సూచిక నివేదికలో వెల్లడించింది.
వైర్‌లెస్ ఇంటర్నెట్ హవా.. పెరిగిన బ్రాడ్‌బ్యాండ్
మొత్తం ఇంటర్నెట్ చందాదారుల్లో సుమారు 106 కోట్ల 64 లక్షల మంది వైర్‌లెస్ ఇంటర్నెట్ వినియోగిస్తుండగా, 4 కోట్ల 77 లక్షల మంది వైర్డ్ ఇంటర్నెట్ వాడుతున్నారు. బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2.03 శాతం పెరగగా, నారోబ్యాండ్ వినియోగదారుల సంఖ్య 0.89 శాతం మేర తగ్గింది.
134 కోట్లకు టెలిఫోన్ వినియోగదారులు
దేశంలో మొత్తం టెలిఫోన్ చందాదారుల సంఖ్య 2026 మార్చి చివరి నాటికి ఉన్న 133 కోట్ల నుంచి జూన్ నాటికి 134 కోట్లకు చేరింది. ఇది త్రైమాసిక ప్రాతిపదికన 1.31 శాతం పెరుగుదలను సూచిస్తోంది. ఇదే సమయంలో దేశంలో మొత్తం టెలీ-డెన్సిటీ 93.26 శాతం నుంచి 94.31 శాతానికి పెరిగింది.