జాతీయం
దేశంలోనే తొలి ఎల్‌ఎన్‌జీ ఆధారిత రైలును ప్రారంభించిన కేంద్రమంత్రి అమిత్ షా, రైల్వేలో విప్లవాత్మక మార్పులు: హోంమంత్రి
28-09-2026 14:25
ప్రధాని మోదీ నాయకత్వంలో రైల్వే రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయని కేంద్రహోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్‌లో తొలి ఎల్‌ఎన్‌జీ రైలును ప్రారంభించారు. 1,500 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
xPress24, Gujarat, September 28,
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ రైల్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు సంభవించాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దేశంలోనే తొలి ఎల్‌ఎన్‌జీ (లిక్విడ్ నేచురల్ గ్యాస్) ఆధారిత రైలును గుజరాత్‌లో ఆయన ప్రారంభించారు.
సబర్మతి వేదికగా జరిగిన కార్యక్రమంలో 1,500 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు కీలక రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రైల్వే రంగంలో పర్యావరణ అనుకూల మార్పులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు.
“రైల్వేల్లో డీజిల్ వినియోగాన్ని 293 కోట్ల లీటర్ల నుంచి 108 కోట్ల లీటర్లకు తగ్గించామన్నారు. 2030 నాటికి డీజిల్ వినియోగాన్ని పూర్తిగా రద్దు చేయడమే మా లక్ష్యం” అని అమిత్ షా స్పష్టం చేశారు. ప్రధాని మోదీ విజన్‌తో రైల్వేలో ఆధునికీకరణ, ఇంధన సామర్థ్యం, పర్యావరణ పరిరక్షణ వైపు దృష్టి సారిస్తున్నామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా గుజరాత్‌లో రైల్వే మౌలిక సదుపాయాలు మరింత బలపడనున్నాయని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని హోం మంత్రి పేర్కొన్నారు.