ఆంధ్రప్రదేశ్
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల పూజా టికెట్లు నేటి సాయంత్రం విడుదల
05-10-2026 13:11

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా నిర్వహించే విశేష ప్రత్యక్ష పూజా సేవల టికెట్లను అక్టోబరు 5న సాయంత్రం విడుదల చేయనున్నట్లు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ తెలిపారు.
xPress24, Vijayawada, October 5,
విజయవాడ, అక్టోబరు 5:
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా నిర్వహించే విశేష ప్రత్యక్ష పూజా సేవల టికెట్లను అక్టోబరు 5న సాయంత్రం విడుదల చేయనున్నట్లు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ తెలిపారు.
అక్టోబరు 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక కుంకుమార్చన, చండీ హోమం, దేవీ ఖడ్గమాలార్చన, శ్రీచక్ర నవావరణార్చన తదితర సేవల్లో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. నిర్ణీత సంఖ్యలో పూజా టికెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘మన మిత్ర’ వాట్సాప్ సేవ
9552300009
ద్వారా అక్టోబరు 5 సాయంత్రం నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.
అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా అక్టోబరు 16న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పూజలను దేవస్థానం తరఫున ‘సర్కార్ సేవ’గా నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు. ఆ రోజు భక్తులు పరోక్ష పూజలను ముందుగా బుక్ చేసుకుని ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా పూజలో పాల్గొనవచ్చని చెప్పారు. పూజా ప్రసాదాలను తపాలా ద్వారా భక్తుల చిరునామాలకు పంపనున్నట్లు తెలిపారు.
అక్టోబరు 16వ తేదీ మినహా మిగిలిన రోజుల్లో భక్తులు ఇంద్రకీలాద్రిపై ప్రత్యక్షంగా ప్రత్యేక పూజల్లో పాల్గొనవచ్చని ఈవో పేర్కొన్నారు. పూజా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులను విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్‌లోని టీటీడీ స్థలం నుంచి ప్రత్యేక వాహనాల్లో కొండపైకి తరలించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.