తెలంగాణ
నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం
01-10-2026 14:00
రాష్ట్ర సచివాలయంలో ఈ మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏల ప్రకటనతో పాటు పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారుని సమాచారం.
xPress24, Hyderabad, October 1,
రాష్ట్ర సచివాలయంలో ఈ మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభంకానుంది. ఈ భేటీకి రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. పరిపాలనాపరమైన అంశాలు, సంక్షేమ పథకాలు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. రాబోయే దసరా పండుగ కానుకగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు కరవు భత్యాలు (డీఏ) ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్కంఠ రేపుతున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ముఖ్యమైన అంశాలపై కీలక నిర్ణయాలు
రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన 22 ఏ భూముల సమస్యకు సంబంధించి ఈ కేబినెట్ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి తుది నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రజల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయాలను సిద్ధం చేసినట్లు సమాచారం.
సిరిసిల్ల పేదల ఇళ్లపై స్పష్టత
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేదల ఇళ్ల హక్కుల కల్పన అంశంపై కూడా మంత్రివర్గం ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అర్హులైన లబ్ధిదారులకు పూర్తి హక్కులు కల్పించే దిశగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొని పలు ప్రణాళికలపై చర్చించనున్నారు.