తెలంగాణ
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ల నమోదుకు నేడు నోటిఫికేషన్ – నవంబరు 6 వరకు అవకాశం
28-09-2026 14:26
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ల నమోదు ప్రక్రియకు ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ జారీ చేయనుంది. నవంబరు 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
xPress24, Hyderabad, September 28,
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం,నల్గొండ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియకు ఎన్నికల సంఘం అధికారులు ఈరోజు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ ఏడాది నవంబరు 1 నాటికి డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తయిన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావడానికి అర్హులు. ఇందుకోసం ఫారం-18 నింపాల్సి ఉంటుంది. నవంబరు 6 వరకు ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించారు. డీఈవోలు, ఈఆర్వోలు, ఏఈఆర్వోల కార్యాలయాల వద్ద ఫారం-18 పత్రాలను అందుబాటులో ఉంచనున్నారు. పోస్టు ద్వారా కూడా ఈఆర్వోలు, ఏఈఆర్వోలకు దరఖాస్తులను పంపించవచ్చు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా ఫారం సమర్పించే అవకాశం ఉంది.అర్హత కలిగిన పట్టభద్రులు సకాలంలో దరఖాస్తు చేసుకొని తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.