తెలంగాణ
పదేళ్ల తర్వాత ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు: భద్రాద్రి జిల్లాలో హోరాహోరీ ప్రచారం.. నేడు పోలింగ్
09-10-2026 09:40
టీజీఎస్ఆర్టీసీలో పదేళ్ల తర్వాత గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్నికల వేడి పెరిగింది. జిల్లాలోని 1,791 మంది ఓటర్లు అక్టోబర్ 9న ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేయనున్నారు. SWF-TWU మరియు EU-NMU కూటముల మధ్య ప్రధాన పోటీ నెలకొనగా, విధుల్లో ఉండే సిబ్బంది ఓటింగ్‌ను కూడా పరిగణనలోకి తీసుకుని అక్టోబర్ 17న తుది ఫలితాలను ప్రకటించనున్నారు.
xPress24, Bhadradri-Kothagudem, October 9,
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో సుమారు పదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం గుర్తింపు సంఘం ఎన్నికల నగారా మోగడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా సందడి నెలకొంది. ఖమ్మం రీజియన్ పరిధిలోకి వచ్చే భద్రాద్రి జిల్లాలో మొత్తం 1,791 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇవాళ ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్మిక సంఘాల నేతలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తూ డిపోలు, కార్యాలయాలు, కార్మికుల నివాస ప్రాంతాలను సందర్శించి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
రెండు ప్రధాన కూటముల మధ్య రసవత్తర పోరు.. 17న తుది ఫలితాలు
ఈ ఎన్నికల బరిలో రాష్ట్రస్థాయిలో 11 కార్మిక సంఘాలు నిలవగా, ప్రధానంగా రెండు కూటముల మధ్య పోటీ నెలకొంది. ఎస్‌డబ్ల్యూఎఫ్ (SWF) - టీడబ్ల్యూయూ (TWU) కూటమికి టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డితో పాటు కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ (INTUC) మద్దతు ప్రకటించగా, మరోవైపు ఎంప్లాయీస్ యూనియన్ (EU) - నేషనల్ మజ్దూర్ యూనియన్ (NMU) పొత్తుతో బరిలోకి దిగాయి. ప్రతి కార్మికుడు రాష్ట్రస్థాయికి తెలుపు రంగు, రీజియన్ స్థాయికి లేత ఆకుపచ్చ రంగు బ్యాలెట్ పేపర్లతో రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది.
శుక్రవారం పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్లను లెక్కించినప్పటికీ.. విధుల్లో ఉన్న కార్మికులకు ఈ నెల 14, 15 తేదీల్లో బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించి, అనంతరం 17వ తేదీన తుది ఫలితాలు వెల్లడించనున్నారు. మొత్తం 51 శాతం ఓట్లు సాధించిన సంఘానికే గుర్తింపు హోదా దక్కుతుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వేతన సవరణ, పని ఒత్తిడి తగ్గింపు వంటి హామీలతో కూటమి అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జీయర్ బాబు కోరారు.
బైట్స్
జీయర్ బాబు, రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ వర్కర్స్ యూనియన్