ఆంధ్రప్రదేశ్
ప్రకాశం జిల్లాలో 6 నుంచి 8 వరకు సేవా సేతు అభియాన్
06-10-2026 09:33
ప్రకాశం జిల్లాలో ఏపీసీపీడీసీఎల్ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు సేవా సేతు అభియాన్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఏపీసీపీడీసీఎల్ ప్రకాశం జిల్లా ఎస్‌ఈ కె. వెంకటేశ్వర్లు తెలిపారు.
xPress24, Ongole, October 5,
ఒంగోలు:
ప్రకాశం జిల్లాలో ఏపీసీపీడీసీఎల్ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు సేవా సేతు అభియాన్ క్యాంపులు నిర్వహించనున్నట్లు ఏపీసీపీడీసీఎల్ ప్రకాశం జిల్లా ఎస్‌ఈ కె. వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం సాయంత్రం ఒంగోలులోని ఎస్‌ఈ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన సేవా సేతు అభియాన్ వివరాలను వెల్లడించారు.
ఈ అభియాన్‌లో భాగంగా ప్రజలకు రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ వ్యవస్థపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్‌కు సంబంధించిన వివిధ కార్యక్రమాలను ఒకే చోట పూర్తి చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద కేంద్ర ప్రభుత్వం 3 కిలోవాట్ల సోలార్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు రూ.78 వేల వరకు సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కూడా అందుబాటులో ఉందన్నారు.
జిల్లాలో ఈ ఏడాది 4 వేల రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు ఎస్‌ఈ తెలిపారు. ప్రతి నెలా సుమారు 500 వరకు కనెక్షన్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే ఎస్సీ, ఎస్టీ వర్గాల వినియోగదారులకు రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బీసీ వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.10 వేల సబ్సిడీ అందిస్తోందన్నారు.
అర్హత ఉన్న ప్రతి గృహ విద్యుత్ వినియోగదారుడు పీఎం సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఇంటినే విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చుకోవాలని కె. వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించవచ్చని తెలిపారు. తద్వారా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడవచ్చన్నారు.
అనంతరం ఎస్‌ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సేవా సేతు అభియాన్ స్టాల్‌ను ఎస్‌ఈ కె. వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు.