ఆంధ్రప్రదేశ్
ప్రకాశం జిల్లాలో స్థానిక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
16-10-2026 15:48

ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది.
xPress24, Ongole, October 16,
ఒంగోలు:
ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఒంగోలు నగరపాలక సంస్థతోపాటు అద్దంకి, దర్శి, చీమకుర్తి మున్సిపాలిటీల్లో మొత్తం 150 వార్డులకు నామినేషన్ల స్వీకరణ చేపట్టినట్లు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తెలిపారు.
నామినేషన్ల స్వీకరణకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ఐదు ప్రాంతాల్లో నామినేషన్ల స్వీకరణకు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
మేయర్ స్థానానికి నామినేషన్ల దాఖలు చేసేందుకు ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్పొరేటర్ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కోసం నగరంలోని డీఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్, రామనగర్ మున్సిపల్ హైస్కూల్, పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్లలో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
అలాగే అద్దంకి, దర్శి, చీమకుర్తి మున్సిపాలిటీల్లోనూ నామినేషన్ల స్వీకరణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి తెలిపారు.