ఆంధ్రప్రదేశ్
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యత
15-10-2026 16:43
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) ద్వారా అందిన అర్జీలను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా పరిష్కరించడంతో పాటు, అర్జీదారుల సంతృప్తి స్థాయిని పెంపొందించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ సూచించారు.
xPress24, Machilipatnam, October 15,
మచిలీపట్నం, అక్టోబర్ 15:
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) ద్వారా అందిన అర్జీలను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా పరిష్కరించడంతో పాటు, అర్జీదారుల సంతృప్తి స్థాయిని పెంపొందించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ సూచించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటమనేని భాస్కర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకత, అర్జీదారుల సంతృప్తికి సంబంధించిన అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ, పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం అనంతరం అర్జీదారుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నిర్వహించే ఫోన్ కాల్స్లో కొన్ని సందర్భాల్లో ప్రతికూల స్పందనలు నమోదవుతున్నాయని తెలిపారు. అర్జీల పరిష్కారానికి సంబంధించి అధికారులు నమోదు చేసే ఎండార్స్మెంట్లలో స్పష్టత లేకపోవడం కూడా ఇందుకు ఒక కారణమని పేర్కొన్నారు.
ఆర్థికంగా సాధ్యం కాని అంశాలు, న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న వివాదాలు, సంబంధిత అధికారుల పరిధిలోకి రాని సమస్యలపై క్షేత్రస్థాయి అధికారులకు తగిన అవగాహన లేకపోవడం వల్ల అర్జీల పరిష్కార స్థితిని నమోదు చేసే సమయంలో సరైన విధానాన్ని అనుసరించకపోవచ్చని వివరించారు. దీంతో అర్జీదారులకు ఫోన్ కాల్స్ వెళ్లినప్పుడు అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలిపారు.
ఈ సమస్యను అధిగమించేందుకు గ్రీవెన్స్ పరిష్కార బాధ్యతలు నిర్వహించే అధికారులకు తగిన శిక్షణ అందించాల్సిన అవసరం ఉందన్నారు. అర్జీని వాస్తవంగా పరిష్కరించారా? పరిష్కరించడం సాధ్యం కాకపోతే అందుకు గల కారణాలేమిటి? అనే విషయాలను స్పష్టంగా పేర్కొంటూ, నిబంధనలకు అనుగుణంగా ఎండార్స్మెంట్లు నమోదు చేసేలా అధికారులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రధాన కార్యదర్శికి వివరించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, అర్జీల పరిష్కారంలో పారదర్శకతను పెంపొందించడం, అర్జీదారుల సంతృప్తి స్థాయిని మెరుగుపరచడం లక్ష్యంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని కలెక్టర్ తెలిపారు.