తెలంగాణ
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొన్నం ప్రభాకర్
08-10-2026 09:41
ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధే ప్రజా పాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా ములకనూరు గ్రామంలో పర్యటించిన ఆయన, ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి మహిళా సంఘాలకు రుణాల చెక్కులను అందజేశారు.
xPress24, Hyderabad, October 7,
ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని ములకనూరు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గ్రామ సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజ్ కింద నలభై లక్షల రూపాయల విలువైన రుణాల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై హామీ
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వైపు నిర్మిస్తున్న 4 లైన్ల రహదారి విస్తరణ కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. రైతుల సంక్షేమం, మహిళల సాధికారత, యువతకు ఉపాధి కల్పనతో పాటు మెరుగైన విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు మహిళా సంఘాలను బలోపేతం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ సహకారంతో మహిళలు స్వయం ఉపాధి రంగంలో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.