ఆంధ్రప్రదేశ్
ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్
08-10-2026 17:11
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు
xPress24, Amaravati, October 8,
మంగళగిరి, అక్టోబర్ 8:
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ప్రజలు, కార్యకర్తలను ఆయన కలుసుకుని వారి నుంచి అర్జీలు స్వీకరించారు.
గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ వ్యవస్థలో విధులు నిర్వహిస్తున్న సంక్షేమ, విద్యా సహాయకులకు ప్రమోషన్ ఛానల్ కల్పించడంతో పాటు విద్యాశాఖలో పదోన్నతి అవకాశాలు కల్పించాలని వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కోరారు. గిరిజన బంజారా తండాల్లోని గుడి పూజారులకు నెలకు రూ.15 వేల గౌరవ వేతనం మంజూరు చేయడంతో పాటు బంజారా దేవాలయాలకు ధూప, దీప, నైవేద్య పథకాన్ని వర్తింపజేయాలని బంజారా ధర్మ రక్షా సమితి ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న గోపాలమిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వారి గౌరవ వేతనాన్ని పెంచాలని రాష్ట్ర గోపాలమిత్ర సర్వీస్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం చీకటిపల్లె గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు శ్మశానవాటికకు బీటీ రోడ్డు నిర్మించాలని స్థానిక ప్రజలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధులు సమర్పించిన వినతులను పరిశీలించి, ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.