తెలంగాణ
ప్రజల ఇంటి వద్దకే మీసేవ డోర్ డెలివరీ సేవలు
24-09-2026 09:59
ప్రజలు మీసేవ కేంద్రాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా తెలంగాణ ప్రభుత్వం మీసేవ డోర్ డెలివరీ సదుపాయాన్ని తీసుకొచ్చింది. హైదరాబాద్ లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో పైలట్ ప్రాతిపదికన అమలు చేస్తున్నట్లు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
xPress24, HYDERABAD, September 24,
తెలంగాణలో ప్రజల ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు వస్తాయని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్ లో మీ సేవ డోర్ డెలివరీ సదుపాయాన్ని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ప్రజలు మీసేవ కేంద్రాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ప్రభుత్వం డోర్ డెలివరీ సదుపాయాన్ని తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు. జనన, మరణ, ఆదాయ, కుల, నివాస సర్టిఫికెట్లతోపాటు రిజిస్ట్రేషన్, పోలీస్ శాఖల సేవలు కూడా ఇంటి వద్దకే వస్తాయని పేర్కొన్నారు.
తొలి దశలో భాగంగా హైదరాబాద్‌లోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాతిపదికన అమలు చేస్తున్నట్లు శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇప్పటికే 70 మందికి పైగా ఏజెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని అన్నారు. ప్రజలు 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా లేదా అధికారిక పోర్టల్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుంటే ఎగ్జిక్యూటివ్‌లు నేరుగా ఇంటికే వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తారని తెలియజేశారు. పౌరుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు, గ్రామాలకు ఈ సేవలను విస్తరిస్తామని వెల్లడించారు.
బైట్- దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి