తెలంగాణ
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆందోళనలు కొనసాగిస్తాం: మహేశ్ గౌడ్
09-10-2026 09:39
హైదరాబాద్ నగరంలో ఓటు హక్కు పరిరక్షణ కోసం తెలంగాణ కాంగ్రెస్, ఇండి కూటమి చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చలో లోక్‌భవన్‌కు యత్నించిన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
xPress24, Hyderabad, October 8,
హైదరాబాద్ నగరంలో ఓటు హక్కు పరిరక్షణ కోసం తెలంగాణ కాంగ్రెస్, ఇండి కూటమి చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సేవ్ డెమోక్రసీ పేరుతో కాంగ్రెస్, ఇండి కూటమి నేతలు చలో లోక్‌భవన్ చేపట్టారు. నెక్లెస్ రోడ్డు ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్‌భవన్ వరకు భారీ ర్యాలీగా బయలుదేరిన నేతలను లోక్‌భవన్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు దాటి ముందుకు వెళ్లేందుకు నాయకులు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఎన్నికల సంఘం వైఖరిపై నిరసన
ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ… కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నప్పటికీ ఆయన పదవిలో కొనసాగడం సరికాదని అన్నారు. తక్షణమే ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసే పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం లేదని ఆరోపించారు. ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని, ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి విశ్వాసం కలిగేలా పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు.
కొనసాగనున్న ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం
దిల్లీలో రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ సహా ఇండి కూటమి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఖండించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాము చేపట్టిన ఈ ఆందోళనలు ఇక్కడితో ఆగిపోవని, భవిష్యత్తులోనూ ప్రజాక్షేత్రంలో పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఓటరు జాబితాలో తప్పులను సరిదిద్దే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు.