జాతీయం
ప్రభుత్వాధినేతగా 25 ఏళ్లు పూర్తి.. దిల్లీ వినాయక మందిరంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
08-10-2026 09:38
ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్లీ సరోజినీ నగర్‌లోని శ్రీ వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజల సుఖసంతోషాలు, ప్రగతి కోసం వినాయకుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని అభినందిస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది.
xPress24, delhi, October 7,
ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీ సరోజినీ నగర్‌లోని శ్రీ వినాయక మందిరాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, సంప్రదాయ క్రతువులు నిర్వహించారు. దేశ ప్రజలందరి సుఖసంతోషాలు, శ్రేయస్సు, ఆయురారోగ్యాల కోసం గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు. వినాయకుడి ఆశీస్సులతో దేశం నిరంతరం ప్రగతి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
గుజరాత్ సీఎం నుంచి దేశ ప్రధాని వరకు.. కేంద్ర కేబినెట్ అభినందనలు
2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ప్రారంభమైన మోదీ ప్రజాసేవా ప్రస్థానం నేటికి పాతికేళ్లు పూర్తి చేసుకుంది. 2014 వరకు ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ఆయన, అనంతరం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి వరుసగా మూడో పర్యాయం దేశాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ప్రభుత్వాధినేతగా పాతికేళ్ల నిరంతర నాయకత్వాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రధాని మోదీని అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గం మంగళవారం ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది.