జాతీయం
ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు ప్రచారంపై కేంద్రం స్పష్టత
02-10-2026 09:39
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు దినంగా పేర్కొంటూ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న గెజిట్ నోటిఫికేషన్ నకిలీదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అలాంటి ఉత్తర్వులు ఏదీ జారీ చేయలేదని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ వెల్లడించింది.
xPress24, Delhi, October 1,
ప్రభుత్వరంగ బ్యాంకులకు శనివారం సెలవు పేరిట సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఎస్‌బీఐ సహా అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు దినంగా మారుస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసినట్లుగా ఓ నకిలీ పత్రం నెట్టింట వైరల్ అయింది. దీనిపై స్పందించిన కేంద్రం, ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి అలాంటి నోటిఫికేషన్ ఎటువంటిదీ వెలువడలేదని స్పష్టం చేసింది. ఇది పూర్తిగా అవాస్తవమని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ తేల్చిచెప్పింది.
బ్యాంకు యూనియన్ల సమ్మె నేపథ్యంలో ప్రచారం
వారానికి ఐదు రోజుల పనివిధానం సహా వివిధ డిమాండ్ల సాధన కోసం బ్యాంక్ యూనియన్లు ఇటీవల ఆందోళనలు, సమ్మెలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నెలలో ఒకరోజు సమ్మె నిర్వహించిన ఉద్యోగులు, నెలాఖరులో మరో మూడు రోజుల పాటు సమ్మె తలపెట్టినప్పటికీ అది చివరి నిమిషంలో రద్దయింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందంటూ కొందరు తప్పుడు ప్రచారానికి తెరలేపారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న సెలవుల విధానం
బ్యాంకు ఉద్యోగుల పనివిధానానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారమే కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. యథావిధిగా ఆదివారాలతో పాటు ప్రతి నెలా రెండో, నాలుగో శనివారాలు మాత్రమే బ్యాంకులకు సెలవు దినాలుగా అమల్లో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. సోషల్‌మీడియాలో వచ్చే ఇలాంటి వదంతులను నమ్మవద్దని వినియోగదారులకు సూచించారు.