జాతీయం
పరిశుభ్రతనే గాంధీజీకి ఇచ్చే అసలైన నివాళి: ప్రధాని నరేంద్ర మోదీ
28-09-2026 10:28
నేడు యువత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు మనం ఇచ్చే అందమైన నివాళి పరిశుభ్రతే అని మన్ కీ బాత్ సందర్భంగా మోదీ తెలిపారు.
xPress24, Delhi, September 27,
అక్టోబర్ 2న మనకు ఎన్నో జీవన సూత్రాలను తెలిపినటువంటి బాపూ జయంతి అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ లో భాగంగా ప్రసంగించారు. గాంధీజీ చెప్పిన వాటిల్లో పరిశుభ్రత కూడా ఒకటి అని గుర్తు చేశారు. చాలాసార్లు మనం మన చుట్టుపక్కల చెత్తను శుభ్రం చేసేందుకు జరిగే ప్రయత్నాలను చూస్తూ ఉంటామని.. ఈ ప్రయత్నాలు ఎంతో ప్రేరణాత్మకమైనవి, ఉత్సాహాన్ని పెంచేవని ప్రధాని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో కూడా ఇటువంటి చిత్రాలు, వీడియోలు, రీల్స్ మాటిమాటికీ మన దృష్టిని ఆకర్షిస్తాయని తెలిపారు. ఇటీవలి రోజుల్లో తాను కూడా ఇటువంటి ఎన్నో మంచి ప్రయత్నాలను చూశానని తెలిపారు. మధ్యప్రదేశ్ లో కూడా కొందరు యువకులు నదిని శుభ్రపరిచే పనిని చేస్తున్నారన్నారు. వారి చిన్న ప్రయత్నాలతో యావత్ సమాజం ముడిపడుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా యువత పురాతన బావులను శుభ్రం చేస్తున్నారన్నారు. దీనివల్ల మన ప్రాచీన వారసత్వాన్ని తిరిగి పునరుధ్ధరించే పని జరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ముంబయికి చెందిన యువత, పరిశుభ్రతపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని ప్రశంసించారు. పశ్చిమ బెంగాల్ లో యువ విద్యార్థులు, స్థానిక ప్రజలతో కలిసి పిక్నిక్ స్థలాలు, బజారులను పరిశుభ్రం చేస్తున్నారని చెప్పారు. మిత్రులారా, ఈ ప్రయత్నాలన్నింటిలో ఒక్క విషయం ఎంతో సహజంగా కనిపిస్తుందనీ.. ఎక్కడో ఒక వ్యక్తి మొదలుపెడితే, అతడితో మరికొందరు వ్యక్తులు ముడిపడి, ఆ తర్వాత ఆ ప్రయాణం మరింత పెద్దదిగా మారుతోందని ప్రధాని తెలిపారు. ప్రజాభాగస్వామ్యం అంటే ఇదేనని హర్షం వ్యక్తం చేశారు. బాపూకి మనం అందించే అన్నింటికంటే అందమైన నివాళి పరిశుభ్రతే అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.