ఆంధ్రప్రదేశ్
పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
30-09-2026 14:06
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
xPress24, Nellore, September 29,
నెల్లూరు జిల్లా:
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో రూ.11,085 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్‌తో కలిసి ఆయన శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలు వలసలు వెళ్లకుండా స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని చెప్పారు.
వెలిగొండ ప్రాజెక్టు రెండో దశ పనులను పూర్తి చేసి మార్కాపురం, నెల్లూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సాగు, తాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. రక్షణ రంగానికి చెందిన వివిధ సంస్థలు రూ.3,500 కోట్ల పెట్టుబడులతో ఉదయగిరి ప్రాంతంలో పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నాయని వెల్లడించారు. మదనపల్లెలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మారుస్తున్నామని అన్నారు. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు తాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు.