ఆంధ్రప్రదేశ్
పాల్వంచ మహిళల సాధికారత... విదేశాలకు ఉత్పత్తుల ఎగుమతి
15-10-2026 09:50

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని నవ మహిళా సాధికారతా కేంద్రం గ్రామీణ మహిళలకు వృత్తి విద్యల్లో శిక్షణనిస్తూ ఆర్థిక స్వావలంబన అందిస్తోంది. ఇప్పటివరకు 5,500 మందికి పైగా మహిళలకు ఉపాధి మార్గాలు చూపగా, ఇక్కడ తయారైన ఉత్పత్తులు అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
xPress24, Bhadradri Kothagudem, October 14,
ఒకప్పుడు రోజువారీ కూలీ పనులు దొరికితేనే కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి నుంచి గ్రామీణ మహిళలు నేడు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. మహిళల ఆసక్తికి అనుగుణంగా వివిధ రకాల వృత్తి విద్యల్లో ఉచిత శిక్షణ ఇస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని నవ మహిళా సాధికారతా కేంద్రం వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తోంది. 2010లో ప్రారంభమైన ఈ కేంద్రం, 2018లో సొసైటీగా రూపాంతరం చెంది ఇప్పటివరకు 5,500 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించింది. ఇప్పటివరకు దాదాపు 1.10 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించడం గమనార్హం.
విభిన్న కోర్సుల్లో ఉచిత శిక్షణ
గ్రామీణ ప్రాంత మహిళల్లో నైపుణ్య లోపం, ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు ఈ కేంద్రం కృషి చేస్తోంది. టైలరింగ్, గార్మెంట్ మేకింగ్, తాటిఆకులతో పర్యావరణహిత ఉత్పత్తులు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, బ్యూటీషియన్ కోర్సులు, కంప్యూటర్ విద్యలో శిక్షణ ఇస్తోంది. కేవలం విద్యకే పరిమితం కాకుండా నేర్చుకున్న అంశాలతో మహిళలు స్వయంగా ఉపాధి యూనిట్లు నెలకొల్పి కుటుంబ ఆదాయం పెంచుకునేలా ఆత్మవిశ్వాసం నింపుతోంది.
విదేశాలకు తాటి ఆకుల ఉత్పత్తుల ఎగుమతి
ఇక్కడ శిక్షణ పొందిన మహిళలు తయారు చేస్తున్న తాటి ఆకుల బుట్టలు, బ్యాగులు, గిఫ్ట్ బాక్సులు, జూట్ బ్యాగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రకృతికి హాని కలిగించని ముడి పదార్థాలతో రూపుదిద్దుకున్న ఈ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, శ్రీలంక వంటి దేశాలకు ఇక్కడ తయారైన వస్తువులు ఎగుమతి అవుతున్నాయి. మహిళల్లోని సృజనాత్మకతకు సరైన వేదిక కల్పిస్తే అద్భుత విజయాలు సాధించవచ్చని ఈ కేంద్రం నిరూపిస్తోంది.
బైట్ - అరుణ, శిక్షకురాలు, నవ మహిళా సాధికారతా కేంద్రం, పాల్వంచ