అంతర్జాతీయం
భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
30-09-2026 11:28
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ప్రాథమిక అవగాహన కుదిరిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ మాట్లాడారు.
xPress24, Hyderabad, September 29,
న్యూయార్క్‌లోని 'ఆసియా సొసైటీ' వేదికగా జరిగిన కార్యక్రమంలో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ మాట్లాడారు. 2020లో తూర్పు లడఖ్ సరిహద్దుల్లో తలెత్తిన సుదీర్ఘ ప్రతిష్టంభన సడలి, సరిహద్దుల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్న నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వేగంగా పుంజుకుంటున్నాయని తెలిపారు. 2024 -2025తో పోలిస్తే ప్రస్తుతం ఇరుదేశాల సంబంధాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయన్నారు. సరిహద్దుల్లో శాంతి నెలకొనకపోవడం, దీర్ఘకాలిక ఉద్రిక్తతలు కొనసాగడం వల్ల రెండు దేశాలకూ ఎలాంటి ప్రయోజనమూ ఉండదని, ఇది మూడో పక్షానికి మాత్రమే లబ్ధి చేకూరుస్తుందని జైశంకర్ స్పష్టం చేశారు.
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ప్రాథమిక అవగాహన కుదిరిందని విదేశాంగ మంత్రి తెలిపారు. అయితే, అమెరికా పన్నులు సుంకాల విధానంలో తీసుకొచ్చిన కొత్త మార్పుల వల్ల కొన్ని చిక్కులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. భారత్‌లో కోట్లాది మంది చిన్న ఉత్పత్తిదారులు, రైతులు, లఘు పరిశ్రమల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, వారి భద్రతకు భంగం వాటిల్లకుండా చర్చలను కొలిక్కి తీసుకురావాల్సి ఉందన్నారు. ప్రపంచ రాజకీయాలు వేగంగా మారుతున్నాయని, మల్టీపోలారిటీ దిశగా ప్రపంచం పయనిస్తోందని జైశంకర్ వ్యాఖ్యానించారు.
సరిహద్దు ఉగ్రవాదం విషయంలో భారత్ ఆందోళనలను అమెరికా సరిగ్గా అర్థం చేసుకోకపోవడం లేదా తగినంత సున్నితత్వంతో స్పందించకపోవడం దెబ్బతీసే అంశమని జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా పాకిస్థాన్ నుంచి జరుగుతున్న సరిహద్దు ఉగ్రవాదాన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోందని, భద్రతా ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని తేల్చి చెప్పారు. ఇక రష్యా-ఉక్రెయిన్, ఇరాన్-గల్ఫ్ ప్రాంతాల్లో కొనసాగుతున్న పోరాటాలు ప్రపంచ వ్యాప్తంగా సప్లై చైన్‌లపై ప్రతికూల ప్రభావం చూపాయని, ముఖ్యంగా 'గ్లోబల్ సౌత్' అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలను ఇవి తీవ్రంగా దెబ్బతీశాయని ఆందోళన వ్యక్తం చేశారు.