జాతీయం
భారత పైలట్ల సేవలు గర్వకారణం: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
02-10-2026 09:38
ప్రాణాలకు తెగించి విమానంలోని ప్రయాణికులందరి ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ అసాధారణ ధైర్యసాహసాలను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు.
xPress24, Delhi, October 1,
కాక్‌పిట్‌లో కో-పైలట్ దాడి చేసినప్పటికీ అసాధారణ సహనం, సమయస్ఫూర్తి ప్రదర్శించి విమానంలోని ప్రయాణికులందరి ప్రాణాలను రక్షించిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ.. కెప్టెన్ స్మిత్ మచ్చర్ చూపిన అసాధారణ ధైర్యం పట్ల దేశం గర్విస్తోందని పేర్కొన్నారు. విమాన ప్రయాణికుల భద్రత కోసం ఆయన ప్రదర్శించిన తెగువ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు.
భద్రతకు పెద్దపీట వేసే భారత పైలట్లు భారత పైలట్లు తమ నైపుణ్యం, క్రమశిక్షణ, ప్రయాణికుల భద్రత పట్ల రాజీపడని నిబద్ధతతో అంతర్జాతీయంగా ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకున్నారని మంత్రి రామ్మోహన్ నాయుడు కొనియాడారు. 'సేవ పరమో ధర్మః' అనే భారతీయ స్ఫూర్తిని స్మిత్ మచ్చర్ చాటిచెప్పారని ప్రశంసించారు. విమానయాన రంగంలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.