జాతీయం
భారత్ వృద్ధి అంచనాలను పెంచిన ప్రపంచ బ్యాంక్
06-10-2026 17:11
అంతర్జాతీయంగా నెలకొన్న వివిధ రకాల అనిశ్చితులు, సవాళ్లను ఎదుర్కొంటూనే... భారత ఆర్థిక వ్యవస్థ మరోసారి తన పటిష్టతను చాటుకుంది.
xPress24, Hyderabad, October 6,
అంతర్జాతీయంగా నెలకొన్న వివిధ రకాల అనిశ్చితులు, సవాళ్లను ఎదుర్కొంటూనే... భారత ఆర్థిక వ్యవస్థ మరోసారి తన పటిష్టతను చాటుకుంది. దేశ వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్ భారీగా సవరించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత జిడిపి వృద్ధి రేటు 7.1 శాతంగా నమోదు కావొచ్చని ప్రపంచ బ్యాంక్ తాజాగా అంచనా వేసింది. అంతకుముందు జూన్ నెలలో విడుదల చేసిన నివేదికలో వృద్ధి రేటును 6.6 శాతంగా అంచనా వేయగా, దేశ ఆర్థిక పురోగతిని దృష్టిలో ఉంచుకొని దానిని ఇప్పుడు 7.1 శాతానికి పెంచింది. ఈ విషయాన్ని తన తాజా ‘ఇండియా డెవలప్‌మెంట్ అప్‌డేట్’ నివేదికలో స్పష్టం చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో భారత్ ఏకంగా 7.8 శాతం వృద్ధిని నమోదు చేసిన విషయం విదితమే. సబ్సిడీలు, తక్కువ ద్రవ్యోల్బణం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పుంజుకోగా... ఆదాయపు పన్ను ఉపశమనాలు, జీఎస్టీ కోతల కారణంగా పట్టణ ప్రాంతాల్లోనూ వినియోగం బలపడినట్లు ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. పారిశ్రామిక రంగం: అంతర్జాతీయ ప్రతికూలతలు ఉన్నప్పటికీ, పారిశ్రామిక రంగం ఊహించిన దానికంటే అత్యంత మెరుగైన ఫలితాలను ఇస్తోందని నివేదిక ప్రశంసించింది.
వ్యవసాయ రంగం: నైరుతి రుతుపవనాల్లో నమోదైన లోటు వర్షపాతం వ్యవసాయ రంగాన్ని కొంతమేర ప్రభావితం చేసే అవకాశం ఉన్నప్పటికీ... పారిశ్రామిక రంగం ఆ లోటును సమర్థవంతంగా భర్తీ చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సేవారంగం: దేశ సేవారంగం మునుపటి కన్నా కాస్త నెమ్మదించినప్పటికీ, ఇప్పటికీ స్థిరంగా కొనసాగుతూ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు దాదాపు 7 శాతం వరకు ఉండవచ్చని ఎస్‌అండ్‌పీ, ఫిచ్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ , ఓఈసీడీ వంటి ప్రముఖ అంతర్జాతీయ ఏజెన్సీలు సైతం ఇటీవల అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలు ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో... భారత్ మాత్రం ప్రపంచ వృద్ధికి ప్రధాన చోదక శక్తిగా ముందుకుసాగుతోందని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.