ఆంధ్రప్రదేశ్
మక్కువలో నూతన మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ప్రారంభం
01-10-2026 10:12
ఒక మండలం అభివృద్ధి చెందాలంటే ముందుగా విద్యాభివృద్ధి జరగాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.
xPress24, Paravathipuram, September 30,
మక్కువ, సెప్టెంబర్ 30:
ఒక మండలం అభివృద్ధి చెందాలంటే ముందుగా విద్యాభివృద్ధి జరగాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండల కేంద్రంలో సుమారు రూ.53 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన మండల విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని బుధవారం మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నూతన కార్యాలయం కేవలం నాలుగు గోడల భవనం కాదని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే దేవాలయమని అన్నారు. ప్రతి పాఠశాల అభివృద్ధి చెందాలని, ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా.. ఈ కార్యాలయానికి ఆరు నెలల క్రితం కొబ్బరికాయ కొట్టింది తామేనని, నేడు గుమ్మడికాయ కట్టింది కూడా తామేనని మంత్రి పేర్కొన్నారు.
సుమారు 25 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరడంతో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు మంత్రి సంధ్యారాణికి ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు. గతంలో వర్షాకాలంలో కార్యాలయంలో గొడుగులు వేసుకుని విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఉండేదని చెప్పారు. ప్రస్తుతం అన్ని సౌకర్యాలతో నూతన కార్యాలయం అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు.