ఆంధ్రప్రదేశ్
ముక్త్యాల-మచిలీపట్నం మధ్య భారీ జలమార్గం
25-09-2026 15:01

కృష్ణాజిల్లా ముక్త్యాల నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 168 కిలోమీటర్ల మేర జలమార్గం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
xPress24, Amaravati, September 25,
అమరావతి, 25 సెప్టెంబర్ 2026 : కృష్ణాజిల్లా ముక్త్యాల నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 168 కిలోమీటర్ల మేర జలమార్గం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈ రోజు స్పందిస్తూ, విజయవాడ, అమరావతి మీదుగా సుమారు 1,700 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ అంతర్గత జలమార్గాల అథారిటీ ప్రాజెక్టును ప్రతిపాదించిందని చెప్పారు. ఈ జలమార్గం అందుబాటులోకి వస్తే ఏటా 50 లక్షల టన్నుల సరుకు రవాణా రోడ్డు మార్గం నుంచి జలమార్గానికి మళ్లే అవకాశం ఉందని, సుమారు 15 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అన్నారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కార్గో రవాణా మరింత సులభతరం కానుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.