ఆంధ్రప్రదేశ్
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశం
26-09-2026 14:58

రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో నెలకొన్న వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
xPress24, AMARAVATI, September 26,
అమరావతి, సెప్టెంబర్ 26:
రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో నెలకొన్న వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి నిర్వహించిన ఈ సమావేశంలో పలు జిల్లాల్లో నివాస ప్రాంతాలు జలమయం కావడం, పంటలు నీట మునగడం, ముంపు ప్రాంతాల్లో చేపడుతున్న పునరావాస చర్యలపై సీఎస్ సాయిప్రసాద్‌తో పాటు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు.
గత ఐదు రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కేజీల బియ్యం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో సహాయక, పునరావాస చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
ఉత్తరాంధ్రలో నదీ ప్రవాహాలు, ముంపు పరిస్థితిని మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆయా జిల్లాల్లోని రిజర్వాయర్లలో నీటి ప్రవాహాల పరిస్థితిని ఇరిగేషన్ అధికారులు సీఎంకు వివరించారు.
హీర మండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఇరిగేషన్, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో తక్షణమే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. లిఫ్ట్ పనులను పూర్తిచేసి వంశధార నీటిని హీర మండలం రిజర్వాయర్‌లోకి తరలించాలని ఆదేశించారు.
పలు జిల్లాల్లో రిజర్వాయర్లను నింపేందుకు తీసుకుంటున్న చర్యలపై కూడా ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. కృష్ణానదిలో ఎగువ నుంచి ప్రస్తుతం పెద్దగా ప్రవాహాలు లేవని, స్థానికంగా వస్తున్న వరద నీటితో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరిగిందని అధికారులు తెలిపారు.
స్థానికంగా వచ్చే వరద నీటిని పూర్తిస్థాయిలో నిల్వ చేసుకునేందుకు పులిచింతల దిగువన, ప్రకాశం బ్యారేజీకి ఎగువన బ్యారేజీ నిర్మాణం అవసరమని అధికారులు వివరించారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన, దిగువన రెండు బ్యారేజీల నిర్మాణానికి గతంలో చేసిన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
తాజా వర్షాల కారణంగా రాష్ట్రంలో వర్షపాతం లోటు 50 శాతం నుంచి 31 శాతానికి తగ్గిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కోస్తాంధ్రలో 19.80 శాతం, రాయలసీమలో 42 శాతం వర్షపాతం లోటు ఉన్నట్లు వివరించారు.
ప్రస్తుతం వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని, అయితే ఉత్తరాంధ్రలో ఎగువ ప్రాంతాల నుంచి నదుల్లోకి వరద ప్రవాహాలు కొనసాగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.