ఆంధ్రప్రదేశ్
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానం సందర్భంగా లోకేష్ పూజలు
07-10-2026 17:47
దేశ శ్రేయస్సు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆయన సంకల్పించిన వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
xPress24, Amaravati, October 7,
అమరావతి:
దేశ శ్రేయస్సు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆయన సంకల్పించిన వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరావతిలోని వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ పేరు మీద పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు.
2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వాధినేతగా ఆయన ప్రస్థానం 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ పూజలు నిర్వహించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. దేశం అన్ని రంగాల్లో ప్రపంచంలో అగ్రస్థానంలో నిలవాలనే లక్ష్యంతో నరేంద్ర మోదీ చేస్తున్న కృషికి అవసరమైన శక్తియుక్తులను ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ యాత్ర’ నిర్వహించడం దేశాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషికి నిదర్శనమని మంత్రి లోకేష్ అన్నారు. ప్రజాసేవలో ఆయన మరింత కాలం కొనసాగుతూ దేశ ప్రగతికి కృషి చేయాలని ఆకాంక్షించారు.