తెలంగాణ
ములుగులో మైనింగ్ మాఫియా ఆగడాలు: తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ దంపతుల ఆవేదన
23-09-2026 14:39
ములుగు మండలం ఏసునగర్ శివారులోని సర్వే నెం. 220/4లో ఉన్న తమ 19 ఎకరాల 10 గుంటల భూమిని మైనింగ్‌కు చెందిన ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని బత్తోజు పద్మ, నరసింహాచారి దంపతులు ఆరోపించారు. తప్పుడు కాగితాలు సృష్టించి చుట్టూ ఫెన్సింగ్ వేస్తున్నారని, తమకు ప్రాణహాని ఉందని వాపోయారు. తమ భూమిని కాపాడి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
xPress24, Mallampalli, September 23,
ములుగు జిల్లా కేంద్రం సమీపంలోని ఏసునగర్ శివారులో ఉన్న తమ పట్టా భూమిని మైనింగ్‌కు సంబంధించిన ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని బాధితులు బత్తోజు పద్మ, నరసింహాచారి దంపతులు ఆరోపించారు. కబ్జాదారుల నుంచి తమ భూమిని రక్షించి, కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
దొంగ కాగితాలు సృష్టించి ఫెన్సింగ్ ఏర్పాటు
బాధితురాలు బత్తోజు పద్మ మాట్లాడుతూ.. ఏసునగర్ పరిధిలోని సర్వే నెంబర్ 220/4 లో తాము గతంలో 30 ఎకరాల భూమిని కొనుగోలు చేశామని, అందులో 10 ఎకరాలు విక్రయించగా ప్రస్తుతం తమ వద్ద 19 ఎకరాల 10 గుంటల భూమి ఉందని తెలిపారు. అయితే మైనింగ్‌కు చెందిన ప్రైవేటు వ్యక్తులు కొందరు దొంగ కాగితాలు సృష్టించి తమ భూమిలోకి అడుగుపెట్టకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సమస్య తేలేవరకు ఇరువర్గాలు భూమిలోకి వెళ్లవద్దని చెప్పారని, తాము మిన్నకుంటే ప్రత్యర్థులు దౌర్జన్యంగా వచ్చి భూమి చుట్టూ ఫెన్సింగ్ వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాదారుల ఆగడాలతో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అన్ని ఆధారాలున్నా దౌర్జన్యాలు: నరసింహాచారి
తమ వద్ద 1986, 2004 సంవత్సరాలకు సంబంధించిన అధికారిక కొనుగోలు పత్రాలు ఉన్నాయని బాధితుడు నరసింహాచారి వెల్లడించారు. అన్ని చట్టబద్ధమైన ఆధారాలు ఉన్నప్పటికీ, తప్పుడు పత్రాలను సృష్టించి తమ భూమిని ఆక్రమించేందుకు ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు.
బైట్స్
బత్తోజు పద్మ, బాధితురాలు (మల్లంపల్లి గ్రామం)
బత్తోజు నరసింహాచారి, బాధితుడు (మల్లంపల్లి గ్రామం)