జాతీయం
యుద్ధ నౌకల కోసం భారీ రక్షణ ఒప్పందం
06-10-2026 17:11
న్యూఢిల్లీలో రక్షణ మంత్రిత్వ శాఖ 'బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్' మధ్య సుమారు 661 కోట్ల రూపాయల విలువైన భారీ రక్షణ ఒప్పందం కుదిరింది.
xPress24, Hyderabad, October 6,
భారత నావికాదళాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో చారిత్రక అడుగు వేసింది. న్యూఢిల్లీలో రక్షణ మంత్రిత్వ శాఖ 'బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్' మధ్య సుమారు 661 కోట్ల రూపాయల విలువైన భారీ రక్షణ ఒప్పందం కుదిరింది. భారత నావికాదళ యుద్ధ నౌకల కోసం 'బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ లాంచర్ల' కొనుగోలు నిమిత్తం రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో జరిగిన ఈ ఒప్పంద విలువ సుమారు 661.50 కోట్ల రూపాయలు. 'బై ఇండియన్-IDDM' కేటగిరీ కింద చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌లో కనీసం 68 శాతం మేర దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం విశేషం. దీనివల్ల ఎంఎస్‌ఎంఈలు సహా అనేక దేశీయ పరిశ్రమలకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు, రాబోయే మూడేళ్లలో భారీగా ఉద్యోగాలు సృష్టించబడతాయి.
భారత నావికాదళానికి బ్రహ్మోస్ ఒక అత్యంత కీలకమైన 'సర్ఫేస్-టు-సర్ఫేస్' సముద్ర దాడి క్షిపణి వ్యవస్థ. ఇది శత్రువుల భూభాగాన్ని లేదా సముద్రంలోని లక్ష్యాలను అత్యంత దూరం నుండి, సూపర్‌సోనిక్ వేగంతో, కచ్చితమైన నిబద్ధతతో ధ్వంసం చేయగలదు. ఈ సరికొత్త ఒప్పందం మన దేశ సముద్ర భద్రతా వలయాన్ని మరింత పటిష్టం చేయడమే కాకుండా, రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తున్న మన దేశ సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోంది.
ఇక భారతదేశ రక్షణ ఎగుమతుల కథలో బ్రహ్మోస్ ఒక మైలురాయిగా నిలుస్తోందని రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తాజాగా వెల్లడించారు. త్వరలోనే మన రక్షణ ఎగుమతులు 600 మిలియన్ డాలర్లను దాటనున్నాయి. ఇప్పటికే ఫిలిప్పీన్స్‌కు సుమారు 330 మిలియన్ డాలర్ల విలువైన బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలను అందించగా.. ఇండోనేషియా, వియత్నాం సహా మూడు ఆగ్నేయాసియా దేశాలతో ఒప్పందాలు కొనసాగుతున్నాయి. వియత్నాంతో సుమారు 100 మిలియన్ డాలర్లు, ఇండోనేషియాతో దాదాపు 200 మిలియన్ డాలర్ల మేర ఎగుమతులు ఉండనున్నాయి. అంతేకాకుండా, సుఖోయ్ యుద్ధ విమానాల ద్వారా ప్రయోగించే 'ఎయిర్-లాంచ్డ్' వెర్షన్ కూడా అద్భుత విజయాలను సాధించిందని ఆయన తెలిపారు.