తెలంగాణ
రెండో రోజుకు చేరిన భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు: అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనం
12-10-2026 17:43
వరంగల్‌లోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవాలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు రెండో రోజుకు వైభవంగా చేరుకున్నాయి. అమ్మవారు నేడు 'అన్నపూర్ణాదేవి' రూపంలో భక్తులకు దర్శనమివ్వగా, భక్తుల రద్దీకి తగినట్లుగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో సునీత తెలిపారు.
xPress24, WARANGAL URBAN, October 12,
వరంగల్ భద్రకాళి దేవాలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు రెండో రోజు ఘనంగా జరిగాయి. ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారు రెండవ రోజున 'అన్నపూర్ణాదేవి' అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లపై ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి (ఈవో) సునీత మాట్లాడుతూ.. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఆలయంలో అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో అమ్మవారికి ప్రత్యేక వాహన సేవలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు