తెలంగాణ
రైతు డిస్కమ్ పేరిట జారీ చేసిన జీవో 17ను వెంటనే ఉపసంహరించుకోవాలి: మాజీ మంత్రి హరీశ్ రావు
13-10-2026 10:59
రైతు డిస్కమ్ ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 17ను బీఆర్ఎస్ నేత హరీశ్ రావు వ్యతిరేకించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ దూరం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. అరకొర విద్యుత్ కేటాయింపులు, కేవలం 2 వేల మంది సిబ్బందితో 30 లక్షలకు పైగా కనెక్షన్ల నిర్వహణ అసాధ్యమని స్పష్టం చేస్తూ, జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
xPress24, Hyderabad, October 13,
రైతు డిస్కమ్ పేరిట ఉచిత విద్యుత్ పథకాన్ని తీసేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీఆర్‌ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. విపక్షాలు, ఉద్యోగ సంఘాలు, విద్యుత్ నిపుణులు, రైతుల అభ్యంతరాలను పట్టించుకోకుండా రైతు డిస్కమ్ ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 17ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హరీశ్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు.
అరకొర కేటాయింపులతో సరఫరా ఎలా సాధ్యం?
జీవో ప్రకారం 30.60 లక్షల వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్లు, మిషన్ భగీరథ సహా మొత్తం 30.62 లక్షల కనెక్షన్లను కొత్త డిస్కమ్‌కు బదిలీ చేశారని హరీశ్ రావు పేర్కొన్నారు. 6.15 లక్షల ట్రాన్స్‌ఫార్మర్లు, 2.51 లక్షల సర్క్యూట్ కిలోమీటర్ల లైన్ల నిర్వహణను కేవలం 2,000 మంది సిబ్బందితో ఎలా నడిపిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 53.28 శాతం థర్మల్ విద్యుత్ ఉంటే, రైతు డిస్కమ్‌కు కేవలం 25 శాతమే కేటాయించారని అన్నారు. 58 శాతం సోలార్ పగటిపూట మాత్రమే వస్తుందని.. రాత్రి ఉండదన్నారు. కేటాయించిన 2,325 మెగావాట్ల జలవిద్యుత్ ఏడాదిలో 3-4 నెలలు మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపారు. మిగతా 8 నెలలు రైతులకు నిరంతర విద్యుత్ ఎలా అందిస్తారని, రాత్రివేళ రైతులను చీకట్లోకి నెట్టేందుకేనా ఈ నిర్ణయమని హరీశ్ రావు ఆరోపించారు.
అప్పుల భారం రైతులపైనేనా?
కొత్త డిస్కమ్‌కు భారీ రుణాలు, బకాయిలు కేటాయిస్తూ దాని ఆర్థిక స్థిరత్వంపై ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వడం లేదని హరీశ్ రావు ఆరోపించారు. రేపు నష్టాల సాకుతో ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసే ఆలోచన ఉందేమో స్పష్టం చేయాలన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ నిరంతరాయంగా కొనసాగుతుందని ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని, రైతుల్లో ఆందోళన నింపే ఈ జీవోను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.