ఆంధ్రప్రదేశ్
రహదారి ప్రమాదాలు, మాదకద్రవ్యాల నివారణకు సమన్వయంతో పనిచేయాలి: జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్
16-10-2026 17:18
మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, రహదారి ప్రమాదాల నివారణతో పాటు మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సూచించారు.
xPress24, Rampachodavaram, October 16,
రంపచోడవరం, అక్టోబర్ 16:
మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, రహదారి ప్రమాదాల నివారణతో పాటు మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సూచించారు.
శుక్రవారం రంపచోడవరంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో ఆపరేషన్ త్రిశూల్పై నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ కె. చక్రవర్తి, జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్, ఓఎస్డీ జావలి, సబ్ కలెక్టర్లు డి. పృధ్వీరాజ్ కుమార్, నరేంద్ర పడల్, డీఎస్పీలు అష్రఫ్ అలీ, పావని తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు, బాలికలపై వేధింపులను అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, బాధితులకు తక్షణ సహాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 హెల్ప్లైన్ను వినియోగించుకునేలా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
రహదారి ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి
రహదారి ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, హెల్మెట్ ధరించకపోవడం వంటి ప్రమాదకర చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు భద్రతకు సంబంధించి పోలీసు, రవాణా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ప్రమాదాల నివారణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.
జిల్లాలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో రహదారుల అనుసంధానం పెరిగిందని, ముఖ్యంగా జాతీయ రహదారుల నిర్మాణంతో ప్రయాణాలు సులభతరమయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు. అయితే, మరోవైపు రోడ్డు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఆరు నెలల్లో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలను సమీక్షించి, ముఖ్యంగా జాతీయ రహదారులపై ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
జాతీయ రహదారుల అనుసంధానం మెరుగుపడటంతో వాహనదారులు అధిక వేగంతో ప్రయాణిస్తున్నారని, రహదారులు ఎంత మెరుగ్గా ఉన్నప్పటికీ అతివేగం ప్రాణాలకు ప్రమాదకరమని కలెక్టర్ హెచ్చరించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు
గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా జిల్లాలోని విద్యాసంస్థల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించి, వాటి బారిన పడకుండా తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు.
ప్రజల భద్రతను పరిరక్షించడం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం లక్ష్యంగా అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కె. దినేష్ కుమార్ సూచించారు. క్షేత్రస్థాయిలో చేపడుతున్న చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని ఆయన ఆదేశించారు.