తెలంగాణ
రహదారి భద్రతా నిధుల నిర్వహణపై సమగ్ర మార్గదర్శకాలు: మంత్రి పొన్నం
19-10-2026 09:45

తెలంగాణలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రహదారి భద్రతా నిధుల నిర్వహణపై జీఓ ఎంఎస్ నంబర్ 48 ద్వారా ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జిల్లాల్లో రోడ్డు భద్రతా కమిటీలను వెంటనే క్రియాశీలం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
xPress24, Hyderabad, October 17,
రాష్ట్రంలో రహదారి భద్రతను పటిష్టం చేయడం, ప్రమాదాలను అరికట్టడం ద్వారా ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా, రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో రహదారి భద్రతా నిధుల సమర్థ నిర్వహణ కొరకు నూతన మార్గదర్శకాలను విడుదల చేస్తూ ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబర్ 48 జారీ చేసిందని ఆయన తెలిపారు. తెలంగాణ మోటారు వాహనాల పన్నుల (సవరణ) చట్టం 2026 ప్రకారం వసూలైన సెస్ మొత్తాన్ని తెలంగాణ రహదారి భద్రతా నాన్-లాప్సబుల్ నిధికి కేటాయించినట్లు వివరించారు. ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, రవాణా శాఖ మంత్రి వైస్ ఛైర్మన్‌గా ఉన్న రాష్ట్ర రహదారి భద్రతా మండలి ఈ నిధుల పర్యవేక్షణ చేపడుతుంది.
ఆన్‌లైన్ అకౌంటింగ్, కాగ్ ద్వారా ఆడిట్
నిధుల వినియోగంలో పారదర్శకత కోసం తెలంగాణ ఆన్‌లైన్ అకౌంటింగ్ విధానాన్ని అన్ని జిల్లాలకు విస్తరించాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. దీని ద్వారా రాబడులు, ఖర్చులను ఎప్పటికప్పుడు సమీక్షించే వీలు కలుగుతుందన్నారు. రాష్ట్ర మరియు జిల్లా స్థాయి నిధుల ఖాతాలన్నింటినీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) ద్వారా తప్పనిసరిగా ఆడిట్ చేయించనున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు రహదారి భద్రతా కమిటీకి అందుబాటులో ఉండేలా ఈ వివరాలను కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు తెలిపారు.
జిల్లా కమిటీలను క్రియాశీలం చేయాలని కలెక్టర్లకు ఆదేశం
రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు జిల్లా రహదారి భద్రతా కమిటీలను వెంటనే క్రియాశీలం చేయాలని పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రతి నెలా జిల్లా కమిటీల సమావేశాలు తప్పనిసరిగా నిర్వహించాలని, ప్రత్యేకంగా జిల్లా సమన్వయకర్తలను నియమించి భద్రతా ప్రణాళికలు సమర్పించాలని సూచించారు. పోలీస్, ఆరోగ్యం, ఆర్ అండ్ బి, విద్యా శాఖలు, జీహెచ్‌ఎంసీలు తమ తరఫున నోడల్ అధికారులను నియమించాలని ఆదేశించారు. వివిధ శాఖలు లీడ్ ఏజెన్సీ ఫర్ రోడ్ సేఫ్టీకి ప్రతి త్రైమాసికంలో యాక్షన్ టేకెన్ నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు.