జాతీయం
వికసిత్ భారత్ సాధనలో యువత పాత్ర కీలకం: ప్రధాని నరేంద్ర మోదీ
25-09-2026 11:36
2047 నాటికి వికసిత్ భారత్ కలని సాకారం చేయడమే లక్ష్యంగా యువత నడుం బిగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. యువత ఎక్కడికి వెళ్లినా ప్రజలతో మాట్లాడుతూ, వారిని భాగస్వామ్యం చేస్తూ పరస్పర సంబంధాలను బలోపేతం చేయడం ఎంతో హర్షణీయమని ప్రధాని కొనియాడారు. విభిన్న ప్రాంతాలు, సామాజిక వర్గాల ప్రజలను కలిసి, వారితో మమేకం కావాలని సూచించారు.
xPress24, Delhi, September 24,
వాద్‌నగర్ తన జన్మభూమి కాగా.. వారణాసి తన కర్మభూమి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సేవా కార్యక్రమాల ద్వారా ఈ రెండు చారిత్రక నగరాలను అనుసంధానిస్తున్న యువతను ప్రధాని అభినందించారు. సేవే పరమ ధర్మం అనే సూత్రంతో ముందుకు సాగాలని సూచించారు. బీజేపీ యువ కార్యకర్తలు చేపట్టిన సేవా యాత్రలో పాల్గొంటున్న వారితో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వాద్‌నగర్ నుంచి వారణాసి వరకు 10 బృందాలుగా బైక్ యాత్ర సాగుతోంది. సేవ, సంపర్క్, యువత భాగస్వామ్యం, సామాజిక సంక్షేమం, సాంస్కృతిక అనుసంధానంతో యాత్ర కొనసాగుతోంది. సేవే తమ ప్రాథమిక లక్ష్యమని.. మాటల్లో కాకుండా చేతల్లో సేవా సందేశాన్ని చూపించాలని ప్రధాని మోదీ యువతకు పిలుపునిచ్చారు. బీజేపీలో కార్యకర్తగా ఉన్న సమయంలో తాను అనేక యాత్రలను నిర్వహించడంతో పాటు స్వయంగా యాత్రల్లో పాల్గొన్న అనుభవం ఉందని మోదీ గుర్తుచేశారు. వాతావరణ పరిస్థితులు, తరచూ మారే ప్రాంతాలు, అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడం వంటి సవాళ్లను యాత్రల్లో ఎదుర్కొన్నానన్నారు. రాజకీయాలు, ఎన్నికలు ఒక ఎత్తు అయితే.. దేశ నిర్మాణమే మన పరమావధి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మనం దేశ నిర్మాణమనే మహా యజ్ఞాన్ని ఒక మిషన్‌లా చేపట్టాం అని పేర్కొన్నారు. వికసిత్ భారత్ సాధనలో యువత పాత్ర అత్యంత కీలకమని, వారే ఈ నవ భారత సృష్టికర్తలని, రేపటి రోజున దాని వల్ల అత్యధికంగా లబ్ధి పొందేది కూడా వారేనని ఆయన అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ కలని సాకారం చేయడమే లక్ష్యంగా యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు. యువత ఎక్కడికి వెళ్లినా ప్రజలతో మాట్లాడుతూ, వారిని భాగస్వామ్యం చేస్తూ పరస్పర సంబంధాలను బలోపేతం చేయడం ఎంతో హర్షణీయమని ఆయన కొనియాడారు. సేవా సంకల్ప్ యాత్ర యువత జీవిత ప్రయాణంలో సేవా సంకల్ప్ యాత్ర అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.