తెలంగాణ
విదేశాలకు తెలంగాణ సన్నబియ్యం ఎగుమతి: స్టీఫెన్ రవీంద్ర
12-10-2026 10:44

తెలంగాణ నుంచి విదేశాలకు సన్నబియ్యం ఎగుమతి చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మనీలాలో జరిగిన అంతర్జాతీయ రైస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన, రాష్ట్రంతో నేరుగా భాగస్వామ్యం కావాలని ప్రపంచ బియ్యం కొనుగోలుదారులను ఆహ్వానించారు.
xPress24, Hyderabad, October 12,
తెలంగాణ రాష్ట్రం నుంచి విదేశాలకు కూడా సన్నబియ్యం ఎగుమతులు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరుగుతున్న 'ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్- 2026'లో ప్రపంచ వ్యవసాయ రంగ ప్రముఖులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో తెలంగాణ సాధించిన విప్లవాత్మక పురోగతిని, నాణ్యమైన ధాన్యం దిగుబడులను అంతర్జాతీయ వేదికపై ఆయన విపులంగా వివరించారు.
రాష్ట్రంలో నాణ్యమైన సన్నబియ్యం ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుండటంతో గ్లోబల్ మార్కెట్‌లో వీటికి మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ బియ్యం కొనుగోలుదారులు, వ్యాపార సంస్థలు తెలంగాణతో నేరుగా భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ భాగస్వామ్యాల ద్వారా రాష్ట్ర రైతులకు, వ్యాపారులకు అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన అవకాశాలు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు.