ఆంధ్రప్రదేశ్
వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది
26-09-2026 09:46

భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
xPress24, Rajahmundry, September 25,
రాజమహేంద్రవరం:
భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వర్షాల ప్రభావంతో జలమయమైన పలు ప్రాంతాలను శుక్రవారం ఆయన సందర్శించారు.
దుప్పలపూడి గ్రామంలో ముంపు తీవ్రత అధికంగా ఉండటంతో ఎమ్మెల్యే స్వయంగా ట్రాక్టర్‌పై వెళ్లి నీట మునిగిన వీధులను పరిశీలించారు. బాధితుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం పునరావాస కేంద్రాలను పరిశీలించి, బాధితులకు అందుతున్న ఆహారం, తాగునీటి సదుపాయాలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ ముందుంటారని అన్నారు. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదిక అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని తెలిపారు. త్వరితగతిన నివేదికలు పంపించి, బాధితులకు తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తీరుపై నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వరద నీటిలో రోడ్డుపై నిలబడి పరిస్థితిని చూసి కారులో వెళ్లిపోయే వారికి బాధితుల కష్టాలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. గత ఐదేళ్ల పాలనలో ఆక్రమణలను తొలగించకుండా, చెరువులు, డ్రైన్ల సమీపంలోని ముంపు ప్రాంతాల్లో ‘జగనన్న కాలనీల’ పేరుతో ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టారని విమర్శించారు.
అచ్యుతాపురత్రయం వద్ద హైటెన్షన్ విద్యుత్ లైన్లు, గెయిల్ పైప్‌లైన్ ఉన్న ప్రాంతం నివాసయోగ్యం కాదని తహసీల్దార్ సూచించినప్పటికీ పట్టాలు ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులు చిల్లర రాజకీయాలు మానుకుని, పునరావాస కేంద్రాల్లో ఏవైనా లోపాలు ఉంటే వాటిని ఎత్తిచూపాలని సవాల్ విసిరారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.