ఆంధ్రప్రదేశ్
వర్షాల పరిస్థితిపై కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన
25-09-2026 11:27
జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తిరువూరు మండలంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించి వర్షాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
xPress24, Vijayawada, September 24,
తిరువూరు:
జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తిరువూరు మండలంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన నిర్వహించి వర్షాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, వర్షపు నీటి ప్రవాహం, రహదారులు, వాగులు, కాలువలు, చెరువుల పరిస్థితిని పరిశీలించి స్థానిక అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
నీటి నిల్వలు ఉన్న ప్రాంతాల్లో తక్షణమే నీటిని తొలగించే చర్యలు చేపట్టాలని, డ్రైనేజీలు, కాలువల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. వాగులు, కాలువలు, చెరువులు, కల్వర్టులు, వంతెనల వద్ద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ప్రమాదకరంగా రాకపోకలు సాగించకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, రహదారులు–భవనాలు, విద్యుత్, వైద్య ఆరోగ్య, పోలీస్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.