ఆంధ్రప్రదేశ్
విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలానికి పెట్టుబడిదారుల నుంచి అనూహ్య స్పందన
25-09-2026 12:17

ఎంతో కాలంగా వినియోగంలో లేని విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలం నిర్వహణకు సంబంధించి పెట్టుబడిదారులతో నిర్వహించిన అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన లభించింది.
xPress24, Visakhapatanam, September 25,
విశాఖపట్నం:
ఎంతో కాలంగా వినియోగంలో లేని విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలం నిర్వహణకు సంబంధించి పెట్టుబడిదారులతో నిర్వహించిన అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన లభించింది. అక్టోబర్ 12, 16 తేదీల్లో నిర్వహించనున్న ప్లాట్ల వేలానికి సంబంధించి విశాఖ ఆర్‌ఐఎన్‌ఎల్, కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్‌ఎల్‌ఎంసీ) ఆధ్వర్యంలో పెట్టుబడిదారులతో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ అధికారులు భూములకు సంబంధించిన పూర్తి వివరాలు, అనుమతులు, ఈ-ఆక్షన్‌కు సంబంధించిన విధివిధానాలను పెట్టుబడిదారులకు వివరించారు. అనంతరం భూముల వేలానికి సంబంధించి పెట్టుబడిదారులు అడిగిన పలు ప్రశ్నలకు స్టీల్ ప్లాంట్ అధికారులు సమాధానాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎన్‌ఎల్‌ఎంసీ సీఈఓ రోహన్ చంద్ ఠాకూర్ మాట్లాడుతూ.. విశాఖలోని హెచ్‌బీ కాలనీ, ఆటోనగర్, గాజువాక ప్రాంతాల్లో మొత్తం 459 ప్లాట్లను విక్రయించనున్నట్లు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు లేని అత్యంత విలువైన భూములను పెట్టుబడిదారులు నిర్భయంగా కొనుగోలు చేసుకోవచ్చని ఆయన సూచించారు.