ఆంధ్రప్రదేశ్
విశాఖ స్టీల్ ప్లాంట్ మిగులు భూములకు అక్టోబర్ 12, 16 తేదీల్లో ఈ-వేలం
25-09-2026 11:31
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్‌ఎల్‌ఎంసీ), రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్–వైజాగ్ స్టీల్ ప్లాంట్)కు చెందిన మిగులు భూముల విక్రయానికి అక్టోబర్ 12, 16 తేదీల్లో ఈ-వేలం నిర్వహించనున్నట్లు ఎన్‌ఎల్‌ఎంసీ జనరల్ మేనేజర్ సునీల్ సాహు తెలిపారు.
xPress24, Vijayawada, September 24,
విజయవాడ:
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (ఎన్‌ఎల్‌ఎంసీ), రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్–వైజాగ్ స్టీల్ ప్లాంట్)కు చెందిన మిగులు భూముల విక్రయానికి అక్టోబర్ 12, 16 తేదీల్లో ఈ-వేలం నిర్వహించనున్నట్లు ఎన్‌ఎల్‌ఎంసీ జనరల్ మేనేజర్ సునీల్ సాహు తెలిపారు.
ఈ-వేలం ప్రక్రియపై పెట్టుబడిదారులకు అవగాహన కల్పించేందుకు విజయవాడలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలు, వాటాదారులు, ప్రైవేటు భాగస్వాములకు ఆస్తుల మానిటైజేషన్ ప్రక్రియపై అవగాహన కల్పించడమే ఈ సదస్సుల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చెందిన వినియోగంలో లేని భూముల వేలం నిర్వహణకు సంబంధించి పెట్టుబడిదారులకు వివరాలు తెలియజేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సదస్సుకు అనూహ్య స్పందన లభించిందని, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ అధికారులు భూములకు సంబంధించిన వివరాలు, అనుమతులు, ఈ-వేలం ప్రక్రియ తదితర అంశాలను పెట్టుబడిదారులకు వివరించారు.
విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 459 ప్లాట్లను వేలం ద్వారా విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు లేని అత్యంత విలువైన భూములను పెట్టుబడిదారులు ఈ-వేలం ద్వారా కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు.