తెలంగాణ
శాటిలైట్ కమ్యూనికేషన్ లైసెన్సింగ్‌లో వివక్ష లేదన్న కేంద్రం
08-10-2026 16:24

దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల నియంత్రణ విధానం పక్షపాతంగా ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారమవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. దేశంలో ఉపగ్రహ ప్రసారాలతో సహా అన్ని టెలికాం సేవలకు నిష్పాక్షికమైన, సమానమైన అనుమతుల విధానాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ విధానం కింద ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవల కోసం 'గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్' విభాగంలో ఇప్పటి వరకు మూడు సంస్థలకు లైసెన్సులు మంజూరు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం లైసెన్స్ పొందిన ఆ మూడు సంస్థల భద్రతా తనిఖీల ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం వెల్లడించింది. ఏ సంస్థకైతే ఈ భద్రతా పరిశీలన పూర్తవుతుందో, ఆ సంస్థ స్పెక్ట్రమ్ కేటాయింపుల తదుపరి దశకు వెళ్తుందని స్పష్టం చేసింది. ఈ మూడు సంస్థలు ప్రస్తుతం ఒకే విధమైన నియంత్రణ దశలో ఉన్నాయని... కాబట్టి ఈ విధానం వివక్షతో కూడుకుని ఉందనడం పూర్తిగా అవాస్తవమని పేర్కొంది.
xPress24, HYDERABAD, October 8,