ఆంధ్రప్రదేశ్
శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన
25-09-2026 14:47
ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో ముంపునకు గురైన ప్రాంతాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం విస్తృతంగా పర్యటించారు.
xPress24, Srikakulam, September 25,
శ్రీకాకుళం జిల్లా, సెప్టెంబర్ 25, 2026:
ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో ముంపునకు గురైన ప్రాంతాల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. సంతబొమ్మాళి మండలంలోని వడ్డీవాడ, అంట్లవరం, వడ్డీతాండ్రా, సంతబొమ్మాళి తదితర ప్రాంతాల్లో పర్యటించి ముంపు పరిస్థితులను, దెబ్బతిన్న పంట పొలాలను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ముంపు ప్రభావిత రైతులతో మంత్రి నేరుగా మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి, నష్టపోయిన పంట పొలాలను గుర్తించి వివరాలను నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
ముంపు కారణంగా దెబ్బతిన్న రహదారులకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. రహదారులు, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అనంతరం గోదలాం, కొల్లిపాడు, లక్కీవలస, మారువాడ, మేఘవరం వరకు ముంపు ప్రభావిత ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు.