ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణరథోత్సవం
03-10-2026 16:47
శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీస్వామి, అమ్మవార్ల స్వర్ణరథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
xPress24, srisailam, October 3,
శ్రీశైలం, అక్టోబర్ 3:
శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీస్వామి, అమ్మవార్ల స్వర్ణరథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు.
అనంతరం లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ఆలయ అర్చకులు ప్రత్యేక సంకల్పాన్ని పఠించారు. దేశంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని స్వామివారిని ప్రార్థించారు.
వేదమంత్రోచ్చారణలు, భక్తుల శివనామస్మరణ మధ్య స్వర్ణరథోత్సవం ప్రారంభమైంది. స్వర్ణరథంపై కొలువుదీరిన శ్రీస్వామి, అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా ప్రదర్శించిన కోలాటం, తప్పెట చిందులు వంటి జానపద కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు దంపతులతో పాటు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.