ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం
16-10-2026 17:20
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి. నిషాంతి శుక్రవారం జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
xPress24, Paderu, October 16,
పాడేరు, అక్టోబర్ 16:
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి. నిషాంతి శుక్రవారం జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలు, ఎన్నికల షెడ్యూల్, సన్నద్ధత, నిర్వహణ ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి తదితర అంశాలపై ఆమె వివరించారు.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిర్ణీత తేదీలు, వివిధ దశల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అవసరమైన ఏర్పాట్ల గురించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు కలెక్టర్ వివరించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రతినిధులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఎన్నికల నిర్వహణలో నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహన అవసరం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని నిబంధనలు, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పాటించాల్సిన మార్గదర్శకాలపై కలెక్టర్ స్పష్టతనిచ్చారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన ప్రతులను అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు పంపిణీ చేశారు.