జాతీయం
సుప్రీంకోర్టు తలుపులు అందరికీ తెరిచే ఉన్నాయి: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
12-10-2026 14:14
'ఇండియా' కూటమి నేతలతో ప్రత్యేక సమావేశానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరాకరించారు. సుప్రీంకోర్టు తలుపులు అందరికీ తెరిచే ఉంటాయని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే పిటిషన్ ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించారు. మరోవైపు కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ విపక్షాలు ఢిల్లీలో నిరసన మార్చ్‌కు సిద్ధమయ్యాయి.
xPress24, Delhi, October 12,
సుప్రీంకోర్టు తలుపులు దేశ ప్రజలందరికీ ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని, చట్ట ప్రకారం ప్రతి ఒక్కరి సమస్యలను న్యాయస్థానం వింటుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని 'ఇండి' కూటమి నాయకులు తనను కలిసేందుకు సమయం కోరగా, పరిపాలనాపరంగా రాజకీయ ప్రతినిధి బృందాన్ని కలవలేనని స్పష్టం చేశారు.
పిటిషన్ల ద్వారానే కోర్టును ఆశ్రయించాలి: సీజేఐ
విపక్ష నేతలు పంపిన లేఖకు నిన్న రాత్రే బదులిచ్చానని.. కలవలేకపోవడానికి గల కారణాలను లేఖలో వివరించానని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. రాజ్యాంగబద్ధంగా సాధారణ పౌరుడైనా, ప్రజాప్రతినిధులైనా ఎవరైనా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే హక్కు ఉందన్నారు. న్యాయవ్యవస్థ పని పిటిషన్లను విచారించి తీర్పులు ఇవ్వడమే అని సీజేఐ పేర్కొన్నారు. విపక్షాలు లేవనెత్తాలనుకుంటున్న అంశాలు ఇప్పటికే న్యాయస్థానం పరిధిలో ఉన్నందున పరిపాలనా స్థాయిలో సమావేశం సాధ్యం కాదని స్పష్టం చేశారు.